ఉత్తరరామచరితం – తెలుగు అనువాదాలు
డా పి వారిజా రాణి, తెలుగు శాఖ, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం
తెలుగు సాహిత్యం సంస్కృత భారతాంధ్రీకరణతో ప్రారంభమైంది. ప్రాచీన సాహిత్యం అంతా కూడా దాదాపు సంస్కృత సాహిత్యం, శాస్త్రాల ప్రభావంతో కొనసాగింది, ఆధునిక సాహిత్యం ఎక్కువ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో, ప్రక్రియా వైవిధ్యంతో వికసించింది. ప్రబంధయుగం వరకూ పురాణేతిహాస, కావ్య, నాటకాది అనువాదాలతో తెలుగు సాహిత్యం సుసంపన్నమై, పదహారవ శతాబ్దం నాటికి స్వతంత్ర ప్రబంధ రచనలతో వికాసం పొందింది. కాబట్టి, సంస్కృత ప్రభావం లేని కావ్య రచన తెలుగులో ఎక్కువ లేదు.
ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనానికి సంస్కృత సాహిత్య పరిచయం అవసరం, అనివార్యం. ఐతే ప్రాచీన కాలంలో సంస్కృత రచనలు తెలుగులోకి అనువాదం కాగా, అర్వాచీన కాలంలో తెలుగు నుండి శతకాలు, కావ్యాలు, ప్రబంధాలు సంస్కృతంలోకి అనువదించడం జరుగుతోంది.
అనువాదం అనేక విధాలుగా ఉంటుంది. ప్రతి అనువాదంలోనూ ఒక విలక్షణత ఉంటుంది.
రచనలో, భావనలో, మూలకర్తకు ఉండే స్వేచ్ఛ అనువాదకులకు ఉండదు. అది తెలుగునుండి సంస్కృతం, సంస్కృతం నుండి తెలుగు, దేనికైనా సరే అనువాదకుడికి స్వేచ్ఛ చాలా తక్కువ. కానీ ఆ ఉన్న అవకాశాన్నేకొందరు గొప్పగా ఉపయోగించుకుని మూలం కంటే గొప్పగా రచిస్తారు.
ఉదా. పోతన భాగవతం.
పోతన రచనా కౌశలం వల్ల వ్యాస భాగవతానికి రాని కీర్తి పోతన భాగవతానికి వచ్చింది.
మూలభాషలో ఉండే నుడికారాలు, రచనా మర్యాదలు, ఛందో వైవిధ్యం , లింగ వచన విభక్తులు మొదలైన అనేక కారణాలు అనువాదకులకు అడ్డం పడతాయి.
మూలాన్ని కొన్నిసార్లు క్లుప్తీకరించడం, కొన్ని సార్లు పెంచడం సర్వ సాధారణం. అంతే కాకుండా, ఇతిహాస, పురాణాల నుండి ఇతివృత్తాన్ని స్వీకరించినపుడు కావ్యాలకు అనుగుణంగా, వస్తువును రసోచితంగా మలచుకునే స్వేచ్ఛ కవికి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసికొని కవులు రచనలలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసారో చర్చించడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ వ్యాసంలో ప్రధానంగా సంస్కృతంలోని భవభూతి – “ఉత్తర రామచరిత” నాటకాన్ని, తెలుగులోని తిక్కన – “నిర్వచనోత్తర రామాయణం”, కంకంటి పాపరాజు “ఉత్తర రామాయణా” లను పరిశీలించడం, తులనాత్మక అధ్యయనం చేయడం.
“మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః|
యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం||”
ఓ కిరాతుడా! కామమోహితమైన క్రౌంచమిథునం లోని ఒక పక్షిని చంపి, నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందావు, అంటూ శోకతప్త హృదయుడైన వాల్మీకి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని తన మనస్సును కరుణరస పూరితమైన దృశ్యంనుండి మరల్చుకోలేక మథనపడసాగాడు. అతని మానసికస్థితిని గమనించిన బ్రహ్మ, వాల్మీకితో ‘నీవు శోకంతో ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమైంది. నీవు రామచరితమును రచింపుము. అది పర్వతాలు, నదులు ఉన్నంతవరకు శాశ్వతకీర్తిని సంపాదిస్తుంది’ అన్నాడు.
ఇది వాల్మీకికి ప్రేరణకాగా –
“కావ్యం రామాయణం కృత్స్నమ్, సీతాయాశ్చరితం మహత్|
పౌలస్త్యవధ మిత్యేవ చకార చరితవ్రతః||” (బా.కాం)
అని కావ్యంలో రామకథను, సీతాచరితమును, రావణవధను వర్ణించానని వాల్మీకి చెప్పాడు.
వాల్మీకి రామాయణాన్ని రాముడు పట్టాభిషిక్తుడై రాజ్యం చేసినపుడు రచించాడు. 24000 శ్లోకాలు, 500 సర్గలు ఉత్తరకాండతో కలిపి 7 కాండలుగా రామాయణాన్ని రచించాడు.
వాల్మీకి రామాయణానికి వచ్చినన్ని అనువాదాలు బహుశ ఏ కావ్యానికి వచ్చి ఉండవేమో? తెలుగులో మొదట రంగనాథరామాయణం ద్విపదకావ్యంగా, భాస్కర, మొల్ల రామాయణాలు, విశ్వనాథ – రామాయణ కల్పవృక్షం పద్యకావ్యాలుగా రచించబడినవి. ఉత్తరరామాయణాన్ని తిక్కన నిర్వచనంలో రాయగా, కంకంటి పాపరాజు చంపువులో రచించాడు.
రామాయణ కథ సంస్కృతంలో కావ్య నాటకాలుగా రాయబడింది. తెలుగులో కూడా రంగనాథ రామాయణం మొదలు, విశ్వనాథ రామాయణ కల్పవృక్షం వరకు ప్రసిద్ధ రామాయణాలు వచ్చాయి. దానికి కారణం రామాయణానికి ఉన్నంత లోకప్రియత్వం మరే కావ్యానికీ లేకపోవడమే. అందుకే చాలామంది కవులు ఆ కథమీద, రాముని పాత్ర మీద ఉన్న ప్రీతిని కావ్యరచన ద్వారా చాటుకున్నారు. ఈ కోవలోకి చెందినదే భవభూతి రాసిన ఉత్తర రామచరిత నాటకం.
భవభూతి పూర్వ రామాయణ కథను శ్రీరామ పట్టాభిషేకం వరకు “మహావీర చరితమ్” అనే పేరుతో నాటకంగా రచించాడు. ఉత్తరకాండలోని కథను “ఉత్తర రామచరితమ్” అనే పేరుతో రచించాడు. కానీ మూలంలోని మొత్తం కథను తీసుకోకుండా (రావణాదుల వృత్తాంతం వదిలి వేసి) కేవలం రాముని కథను మాత్రమే తీసుకుని సుందరమైన, ఉదాత్తేతివృత్తంగా నాటకాన్ని మలచాడు. కథలో కొన్ని మార్పులు చేసి సుఖాంతంగా కథను ముగించాడు.
అదే కథను తీసుకుని తెలుగులో తిక్కన “నిర్వచనోత్తర రామాయణం”గా రచించగా, కంకంటి పాపరాజు “ఉత్తర రామాయణా”న్ని ప్రబంధంగా తీర్చిదిద్దాడు.
అనువాద విధానం :
ఒక మూల గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని, ఒక రచనగా అనువాదం చేసినపుడు కవులు తాము స్వీకరించే ప్రక్రియకు అనుగుణంగా కథలో ఎలాంటి మార్పులు చేస్తారు? అనేది చర్చించాల్సిన అంశం. ఇక్కడ మొదట “ఉత్తర రామాయణా”లను గురించి మాట్లాడు కోవాలి.
భవభూతి వాల్మీకి రాసిన ఉత్తర రామాయణం నుండి రావణాదుల ఇతివృత్తాన్ని పూర్తిగా వదిలిపెట్టి, సీతారాముల కథను మాత్రమే తీసుకున్నాడు. కానీ తెలుగు కవులిద్దరూ వాల్మీకి రామాయణ కథను ఉన్నదున్నట్లు స్వీకరించారు. ఈ మూడు రచనల్లోని సీతారాముల కథను గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఈ రచనల్లో ముగ్గురూ కవులూ ఏ అంశాలను గురించి సమానంగా వర్ణించారో వాటిని మూలంతో పోల్చి చూస్తే ఆయా కవులు తమ రచనల్లో చేసిన మార్పులు చేర్పులను పరిశీలించే అవకాశం ఉంటుంది.
ఇతివృత్తం – ఉత్తర రామ చరితం:
నాటకంలో కథ శ్రీరామ పట్టాభిషేకం తర్వాత మొదలౌతుంది. జనకుడు, రాముని తల్లులు వెళ్ళిపోగా వాళ్ళ వియోగ దుఃఖంతో ఉన్న సీతను ఆనందింపజేసేందుకు, పూర్వరామాయణ ఘట్టాలను చిత్రించి ఉన్న చిత్రపటాలను చూసేందుకు సీత, రామ, లక్ష్మణులు వెళ్తారు. ఆ పటాలను చూస్తూ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందిస్తారు. వారు తిరిగిన ప్రదేశాలను మళ్ళీ చూడాలని ఉందని, మనం కలిసి విహరించడానికి వెళ్దామని రాముని అడుగుతుంది సీత. సరేనంటాడు రాముడు. లక్ష్మణుని రథం సిద్ధం చేయమని చెప్తాడు.
అశోకవనంలోని సీత చిత్రపటాన్ని చూసిన రాముడు మళ్ళీ అలాంటి వియోగం సంభవించకూడదు అనుకుంటాడు రాముడు. అంతలో గర్భిణియైన సీత అలిసి రాముని బాహువులపైన నిద్రిస్తుంది. అప్పుడే దుర్ముఖుడు అక్కడికి వచ్చి, సీతపై వచ్చిన లోకాపవాదాన్ని గురించి చెప్పగా, రాజధర్మం కోసం సీతను వదులుకోవడానికి సిద్ధపడతాడు రాముడు. సీతకు చెప్పకుండానే నిండుగర్భిణి ఐన ఆమెను వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదిలి రమ్మని చెప్తాడు రాముడు.
సీత గంగానది సమీపంలో లవకుశులకు జన్మనిస్తుంది. భాగీరథి ఆ పిల్లలను వాల్మీకికి అప్పగిస్తుంది. అలాగే సీతకు తిరస్కరిణీ విద్యను ఉపదేశించి ఎవరికీ కనబడకుండా వరమిస్తుంది.
వాల్మీకి రచించిన, రామాయణాన్ని లవకుశులచేత గానం చేయించి, నాటకంగా ప్రదర్శింపజేస్తాడు. వాల్మీకి సీత పవిత్రతను నిరూపించి, సీతారామ లవకుశులను కలుపుతాడు. కథ సుఖాంతం అవుతుంది.
తిక్కన – నిర్వచనోత్తర రామాయణం :
ఈ కావ్యం వచనం లేకుండా రాయబడిన పద్యకావ్యం. మొదటి ఏడు ఆశ్వాసాల్లో రావణాదుల కథ ఉన్నది. 8,9,10 ఆశ్వాసాల్లో సీతారాముల కథ ఉన్నది.
కథ సీతారాముల పట్టాభిషేకం తో ప్రారంభమైంది. భద్రుడు అనే గూఢచారి సీతపై వచ్చిన అపవాదును గురించి చెప్పగా, రాముడు గర్భవతియైన సీతను వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుని పంపిస్తాడు.
సీత కుశలవులకు జన్మనిస్తుంది. రాముడు సీత బంగారు ప్రతిమను పక్కన ఉంచుకుని అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ సందర్భంలో కుశలవులు రామాయణ గానంచేస్తారు. రాముడు కుశలవులను, సీతను కలుసుకుంటాడు. సీత రసాతలానికి వెళ్ళిపోయి, ఆమె మహత్త్వాన్ని నిరూపించుకుంటుంది.
కథను ఇంతవరకే ముగించాడు తిక్కన. రామ నిర్యాణాన్ని ముట్టుకోలేదు. మిగతా కథ అంతా వాల్మీకి రామాయణాన్నే పోలి ఉంది. తిక్కన రామాయణం వాల్మీకి లాగానే సీతపరంగా రాసినట్లు అనిపిస్తుంది. స్త్రీపక్షపాతిగా తిక్కన కనిపిస్తాడు. ఉదాహరణలు తర్వాత చూపిస్తాను.
కంకంటి పాపరాజు – ఉత్తర రామాయణం (ప్రబంధం) :
ఇది 8 ఆశ్వాసాల ప్రబంధం. 1 – 5 వరకు రావణాదుల వృత్తాంతాలు ఉన్నాయి. 6 నుండి 8 వరకు రాముని కథ ఉన్నది.
కథ సీతారాముల వనవిహారంతో ప్రారంభమైంది. జనాపవాదం వలన రాముడు గర్భిణియైన సీతను ఆశ్రమ పరిసరాల్లో వదిలిపెట్టి రమ్మని, లక్ష్మణునికి చెప్తాడు. రాముడు చేసిన అశ్వమేధయాగ సందర్భంలో కుశలవులు రామాయణ గానం చేస్తారు.
వాల్మీకి సీత గొప్పతనాన్ని జనులందరి ముందూ నిరూపించగా, సీత రసాతలానికి వెళ్ళిపోతుంది. రాముడు బాధపడి, కుశలవులకు పట్టాభిషేకం చేసి, వైకుంఠానికి వెళ్తాడు, పరమపదాన్ని పొందుతాడు. అని వర్ణించబడింది.
ఇలా వాల్మీకి రామాయణంలోని కథను ఎలాంటి మార్పు లేకుండా తీసుకుని, కథను విషాదాంతం చేసాడు పాపరాజు.
ముగ్గురి రచనలను పరిశీలిస్తే, తిక్కన మూలంలోని అనవసర ఘట్టాలను పరిహరించి, స్వతంత్రానువాదం చేసాడు. రచనాశైలిలో తనదైన ముద్ర వేసాడు.
వస్త్వైక్యాన్ని సాధించడానికి రాముని శాంత స్వభావం, ధర్మవీరం, త్యాగం, విప్రలంభ శృంగారం అన్నింటిలోనూ రాముని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కథావస్తువును మాత్రమే మూలంనుండి గ్రహించాడు. రామ నిర్యాణాన్ని వదిలివేసి, రాముడు లవకుశులతో కలిసి పరిపాలన చేస్తున్నట్లు మంగళాంతంగా కావ్యాన్ని ముగించాడు.
కంకంటి పాపరాజు తన కథను ఎలా నడపాలనుకున్నాడో ముందుగానే చెప్పాడు.
“ఇహపర సాధకంబన రహించు ప్రబంధమొనర్ప శ్రీ రఘూ
ద్వహుని చరిత్రమున్ దొరకె, వాసిగ నీ కృతి రత్నమే మహా
మహునకు సంతసంబున సమర్పణ సేయుడునంచు నెమ్మదిన్
దుహితకు భర్త నారయు జనున్ బలె యోజన సేయుచున్నెడన్”
పాపరాజుకు రామునిలో భగవత్తత్త్వం కనిపిస్తుంది. శ్రీ రాముని కథను వినడం వలన ఇహపర సాధకమవుతుందని భావించాడు. అందువల్లనే ఈ ప్రబంధ కథలో రాముని సాధారణ మానవునిలా కాకుండా ఒక భగవత్స్వరూపుడి కథగా సమాప్తి చేసాడు. తిక్కన లాగా మధ్యలో ఆపకుండా, కుశలవుల పట్టాభిషేకం చేసిన శ్రీరాముని ఒక అవతారమూర్తిగా చిత్రించి, శ్రీమన్నారాయణమూర్తిగా అవతార సమాప్తి చేసాడు.
ఒకసారి వీరి కథా సంవిధానాన్ని, పాత్రలను మలచిన విధానాన్ని పరిశీలించాలి. ముందుగా –
భవభూతి – ఉత్తరరామ చరిత నాటకం
“ఉత్తరే రామచరితే భవభూతి ర్విశిష్యతే” అని ప్రసిద్ధి. ఈయన రచించిన నాటకాల్లో ‘ఉత్తర రామచరితమ్’ అత్యుత్తమ నాటకం. ఇది ఆయన గొప్పతనాన్ని నిలబెడుతున్నది.
మూలంలోని కథను, సీతారాముల పాత్రలను చిత్రించడంలో నాటకానికి కావలసిన మార్పులను చేసుకున్నాడు. ప్రయోజనాన్ని సాధించాడు.
ఏ రచన ఐనా ఏదో ఒక ప్రయోజనాన్ని పాఠకులకు అందించాలనేది నియమం. అది దృష్టిలో పెట్టుకునే ప్రాచీన సాహిత్యమంతా కూడా మానవుని జీవన విధానాన్ని క్రమశిక్షణతో గడపటానికి మార్గనిర్దేశం చేస్తుంది.
మానవులు జీవితంలో బ్రహ్మచర్యాది చతురాశ్రమ ధర్మాలను పాటిస్తూ, నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతూ, ధర్మార్థకామమోక్షాది చతుర్విధ పురుషార్థాలను సాధించి మోక్షాన్ని పొందటమే అంతిమ జీవన లక్ష్యంగా నిర్దేశించారు. అలాంటి క్రమశిక్షణతో జీవించిన వ్యక్తులను కావ్యాలకు నాయకులుగా, ఆదర్శపాత్రలుగా స్వీకరించి పురాణేతిహాస, కావ్య నాటకాదులను రచించారు. ఉదా:
కాళిదాసు, రఘువంశ మహాకావ్యంలో, రాముని వంశంలోని పూర్వీకులైన దిలీపుడు మొదలైన రఘువంశ రాజుల క్రమశిక్షణను, నియమబద్ధమైన జీవన విధానాన్ని గురించి ఇలా చెప్పాడు.
“శైశవేఽభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణామ్ |
వార్ధకే ముని వృత్తీనామ్ యోగేనాంతే తనుత్యజామ్” ||
“త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణామ్ |
యశసే విజిగీషూణామ్ ప్రజాయై గృహమేధినామ్||”
యోగ్యత కలిగిన వారికి దానం చేయడానికే ధనాన్ని సముపార్జించారు. నిరంతరం నిజం మాట్లాడటానికే మితంగా మాట్లాడారు. అనవసర ప్రసంగాలు చేయరు. వంశానికి గొప్ప కీర్తిని సంపాదించి పెట్టడానికే యుద్ధాల్లో విజయాలుసాధించారు. ప్రజల యోగక్షేమాలను గురించి మాత్రమే ఆలోచించే సత్సంతానాన్ని పొందటానికి మాత్రమే వివాహం చేసుకుని గృహస్థులైనారు రఘువంశ రాజులు. రాజుల జీవితంలో స్వార్థం అనేది ఉండకూడదు. అనే సందేశాన్ని అందించడానికే, కాళిదాసు ఈ లక్షణాలను చెప్పాడు.
నిస్వార్థంగా ఉండే రాజు ప్రజలందరినీ తన కన్న బిడ్డలవలే చూసుకోగలడు. అనేది ఆదర్శవంతమైన జీవన విధానం. రాజు ఇలా ఉంటేనే ప్రజలు కూడా అలాంటి ఆదర్శాలను పాటిస్తారు. “యథారాజా తథా ప్రజా” అనేది కవుల అభిప్రాయం. ఇలాంటి భారతీయ జీవన విధానాన్ని కవులు రామాది పాత్రల ద్వారా ప్రజల జీవన విధానానికి మార్గ నిర్దేశం చేసారు. అదే కావ్య ప్రయోజనం.
ఐతే ఇతిహాసాల్లో ఇలాంటి రాజులు కొన్ని సందర్భాల్లో తప్పుగా ప్రవర్తించడం వల్ల రాజు జీవితం పైన, ఆయా పాత్రల ఆదర్శాలపైన మచ్చ మిగిలిపోయింది. ఉదా:కు రాముడు, దుష్యంతుడు. ఇలాంటి పాత్రలపై వచ్చిన అపవాదును తొలగించడానికి కవులు కథల్లో మార్పులు చేర్పులు చేసారు.
“రామో విగ్రహవాన్ ధర్మః” ధర్మానికి ఒక ఆకారం ఇస్తే, అదే రాముడు. ధర్మ స్వరూపుడు. కాని, నిండు గర్భిణి ఐన సీతను లోకాపవాదు కారణంగా వదిలివేసాడు. రాముడు ఏ తప్పూ చేయని సీతను అడవికి పంపించాడు. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అది రాముని జీవితంలో ఒక చెరగని మచ్చ. రాముడు ప్రజల కోసమే ఆ పని చేసినా, ప్రజలు మెచ్చని నిర్ణయం.
ఐతే రాజుకు, తన జీవితం, సంతోషం, బంధువులు, స్నేహితులు, చివరికి భార్య కంటే కూడా తన రాజ్యం, తన ప్రజలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రజానురంజకంగా పరిపాలన చేసి, ప్రజల మెప్పును పొంది, ఆదర్శవంతమైన పరిపాలకుడుగా ఉండటానికి రాజు తన జీవితాన్ని, సుఖ సంతోషాలను త్యాగం చేయడానికి వెనకడుగు వేయకూడదు.
నిస్వార్థంగా రాజ్యం కోసం, ప్రజల కోసం అన్నీ త్యాగాలు చేయడమే ఆదర్శం.
“స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీమపి|
ఆరాధనాయ లోకస్య ముంచతే నాస్తి మే వ్యథా” ||
అని రాముని పాత్ర ద్వారా చెప్పించి, రాముని మచ్చను తొలగించే ప్రయత్నం చేసాడు భవభూతి. రాముని పై సానుభూతి కలిగే విధంగా సీతను వదిలివేసిన రాముడు, సీతకై ఎంతగా పరితపించాడో చూపిస్తూ, అతి దీనమైన రాముడి ఆవేదనను కళ్ళకు కట్టినట్లు ప్రత్యక్షం చేసి, రాముడి పాత్రపైన సానుభూతి కలిగేలా చేసాడు భవభూతి.
ఇలా కావ్యాలలో మార్పులు చేసిన సందర్భానికి మరొక ఉదాహరణ కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం.
భరత వంశానికి మూల పురుషుడైన దుష్యంతుని కథలో మార్పులు చేసాడు కాళిదాసు. శకుంతలను ప్రేమించి, గాంధర్వ వివాహం చేసికొని, గర్భవతిని చేసి, రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుడు, తన రాజ్యానికి కొడుకును తీసుకుని వచ్చిన శకుంతలను నిరాకరిస్తాడు. నీవెవరో నాకు తెలియదు అని అసత్యం చెప్తాడు. దీని కారణంగా అపవాదుకు గురైన దుష్యంతుని అపవాదును తొలగించి అతనిని ఒక ఉత్తమ పరిపాలకుడుగా నిలబెట్టడానికి అభిజ్ఞానాన్ని సృష్టించి, దుర్వాసుని శాపం వల్లనే దుష్యంతుడు శకుంతలను మరిచి పోయినట్లు కథను కల్పించి, ఆ పాత్ర గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని , గౌరవాన్ని కాపాడాడు కాళిదాసు. అనడంలో సందేహం లేదు.
భవభూతి నాటక ప్రారంభంలో, పూర్వ రామాయణ కథను పాఠకులకు గుర్తు చేయడానికి చిత్రపట సందర్శన అనే ఒక సన్నివేశాన్ని కల్పించాడు. సీతారామ లక్ష్మణులు చిత్రపటాలను చూస్తుండగా, ఈ సందర్భంలో, శూర్పణఖ చిత్రాన్ని చూడగానే, సీత “దుర్జనులు అసుఖాన్ని కలిగిస్తారు” అని అంటుంది. దానికి రాముడు, “నాకైతే ఆ వియోగం వర్తమానంలోనే జరుగుతున్నట్లు అనిపిస్తుంది.” అంటాడు. అప్పుడు లక్ష్మణుడు సీతతో, “అన్న రాముడు అప్పుడు అనుభవించిన దుఃఖానికి వజ్రంలాంటి హృదయం కూడా కరిగిపోయింది” అని రాముని దుఃఖాన్ని తలచుకుని అంటాడు. అది గుర్తుకు వచ్చిన రాముడు,
“తత్కాలం ప్రియజన విప్రయోగ జన్మా
తీవ్రోపి ప్రతికృతి వాంఛయా విసోఢః
దుఃఖాగ్నిర్మనసి పునర్విపచ్యమానో
హృన్మర్మ వ్రణ ఇవ వేదనాం కరోతి” ఆ సంఘటనలను తలచుకున్న ప్రతిక్షణం కూడా ఆ దుఃఖాగ్ని నా మనసును దహించి వేస్తుంది. హృదయానికి అయిన మానని గాయంలా అది ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. అంటాడు.
లక్ష్మణుడు కూడా, రాముని కథ తెలిసిన ప్రతి రాయి కూడా కన్నీరు కార్చింది. అని చెప్పగా, సీత, “నావల్ల రాముడు ఎంత దుఃఖాన్ని అనుభవించాడు?” అని బాధపడుతుంది.
అశోక వనంలో దిగాలుగా కూర్చుని ఉన్న సీత చిత్రపటాన్ని చూసి, సీతతో అనుభవించిన వియోగ దుఃఖాన్ని తలచుకొని రాముడు –
“ఇయం గేహే లక్ష్మీ, రియమమృతవర్తి ర్నయనయోః
అసావస్యాః స్పర్శే వపుషి బహుల శ్చందన రసః |
అయం బాహుః కంఠే శిశిర మసృణో మౌక్తిక సరః
కిమస్యా నప్రేయో, యది పరమసహ్యస్తు విరహః ||”
“ఈ సీత నా గృహానికి లక్ష్మి. నా కళ్ళకు చల్లదనాన్ని కూర్చే అమృతపు శలాక. ఆమె స్పర్శ నాకు చందన రసాన్ని పూసుకున్నంత హాయిని గొల్పుతుంది. ఆమె బాహువులు నా కంఠాన్ని చుట్టుకుంటే, అది నా మెడలో అలంకరించిన ముత్యాల దండలా అనిపిస్తుంది. నా సీతకు సంబంధించిన అన్ని విషయాలూ నాకెంతో ప్రియమైనవి. కేవలం ఆమె విరహం మాత్రం నాకు సహించలేనిది” అని అనుకున్నాడు. ఈ మాటల ద్వారా భవభూతి భావికథా సూచన చేశాడు. ఇది వస్తుధ్వని.
అంటే ఆమె వియోగాన్ని భరించడం నాకు అన్నింటికంటే నచ్చని విషయం. అది ఎంతో బాధాకరమైంది. అని భావించాడు. దీనిని బట్టి రాముడికి సీతపైన ఎంత అవ్యాజమైన ప్రేమ ఉందో అర్థమౌతుంది. అలాంటి రాముడు కేవలం ఒక అపవాదు కోసం తనకెంతో ఇష్టమైన సీతను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే, ఆయనకు భర్త అనే ఒక బాధ్యత, రాజధర్మం అనే ఒక నిస్వార్థమైన నిర్ణయం ముందు చిన్నదై పోయింది. అందుకే, ఈ సందర్భంలో, అపవాదును మోసుకుని వచ్చిన దుర్ముఖునితో రాముడు –
“రాజ్యం కోసం సీతను కూడా త్యజించడానికి వెనుకాడను” అని ధైర్యంగా చెప్పాడు. అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః” యుక్త వయసులో పితృవాక్య పరిపాలన అనే ధర్మానికి కట్టుబడి అటు రాజ్యానికి, ఇటు తల్లిదండ్రులకూ దూరమయ్యాడు రాముడు. ఇవే సంఘటనలు రాముడి గొప్పతనాన్ని నిలబెడతాయి.
సాధారణంగా కావ్య, నాటకాల్లో నాయకులైన పురుష పాత్రలు గంభీరంగా ఉంటాయి. ఆ పాత్రలు కన్నీళ్ళు పెట్టుకోవు. కానీ సీతను దూరం చేసుకున్న రాముని వ్యథ, ఆవేదన, అతడు అనుభవించిన దుఃఖం వర్ణనాతీతం. దానిని భవభూతి ఇలా వర్ణించాడు. –
రాముడు అగస్త్యుని ఆశ్రమంనుండి వెళ్తూ మార్గమధ్యంలో పంచవటీ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ సీతతో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తాడు.
“దలతి హృదయం గాఢోద్వేగాత్, ద్విధా తు న భిద్యతే
వహతి వికలః కాయో మోహం, న ముంచతి చేతసాం |
జ్వలయతి తనూ మన్తరాహః కరోతి న భస్మసాత్,
ప్రహరతి విధిర్మర్మ చ్ఛేదీ, న కృన్తతి జీవితమ్ ||”
రాముడు సీతావియోగం వల్ల పొందిన బాధ నాటకంలో చాలా స్పష్టంగా వ్యక్తమైంది. రాముడు సీతకోసం రోదించాడు, మూర్ఛ పోయాడు, ఆమె స్పర్శ కోసం తపించాడు. సీతా వియోగ దుఃఖాన్ని దిగమింగుకుంటూనే రాజ్య పాలన చేశాడు. బయటకు గాంభీర్యం ప్రదర్శించినా లోపల ఆ దుఃఖం బాధ పెడుతూనే ఉంది. కానీ జనుల ముందుగానీ, ఎవరిముందు కూడా వ్యక్తం చేయలేని దుఃఖాన్ని రాముడు ఏకాంతంలో అనుభవిస్తున్నాడు. ఈ విషయాన్ని తిక్కన కూడా ఇలా వర్ణించాడు.
“వీట దురాత్ములైన యవివేకులు గొందఱనింద్యయైన య
జ్జోటి చరిత్ర మంగనల చొప్పుగ సంశయమంది యాడు పె
న్మాటలకేల యీ దురభిమానము పూనితి? వానినేల నే
గీటున బుచ్చనైతి? బరికింపక చేసితి, నింతి బాసితిన్” అని చింతించాడట రాముడు.
కంకంటి పాపరాజు కూడా, వాల్మీకి ‘సీత నిష్కల్మష’ అని చెప్పినపుడు, రాముడు
“తెలిసియు లోకులాడు సడి దీర్పగ గూడక యింతసేసితిన్
గల దపరాధ మోర్వుడలుకన్ వల దిక్కవలస్మదీయు పు
త్రులగుదు రీమె సాధ్వియగు రూఢిగ నింకొకసారి సీతయం
దలి ప్రజ’లౌ’ననంగ శపథం బొనరించిన జాలమేలగున్ ” (88-8)
అని ఈ జనులు మళ్ళీ నన్ను నింద వేయకుండ వారి కళ్ళముందే మళ్ళీ శపథము చేయమంటాడు.
రాముడు నాటకంలో భిన్నంగా కనబడ్డాడు. సీత ను మళ్ళీ కలిస్తే బాగుండుననే ఆశతో, సంయోగోత్సుకతతో ఉంటాడు అందుకే మళ్ళీ ఇద్దరూ ఒకటయ్యేలా చిత్రించాడు నాటక కర్త.
కావ్యంలో రాముని భగవత్స్వరూపుడిగా చిత్రించాడు పాపరాజు. కాబట్టి చివరికి
రాముడు తానే విష్ణువై వైకుంఠానికి వెళ్ళాడు.
“మకర కుండల వజ్ర మహనీయ ధళధళల్
చికిలి లేనగవుతో జెలిమి సలుప
మకుట పంకజ లాగ మణిరుచుల్ వినువీథి
గపట సంధ్యారాగ కాంతి బెనుప,
శారీర గారు డాశ్మచ్ఛాయ లెదవ్రేలు
వైజయంతిక తోడ వాదులాడ,
గరలగ్న శంఖచక్రశ్రీలు శతకోటి
చంద్రసూర్యులు జోక జౌకసేయ
గటితటా బద్ధ కనకాంశుకము మెఱుంగు
లసమయ తటిల్లతల సొంపుదెసల నింప,
గరుడ వాహనమెక్కి లోకములు పొగడ
రాముడవ్వేళ వైకుంఠ ధాముడయ్యె” (8-279)అని వర్ణించాడు కంకంటి పాపరాజు.
సీత :
ఈమె జనకుని కూతురు. శ్రీరాముని ధర్మపత్ని. ఈమె అత్యంత సుకుమారి. సహృదయ.
సీతారాముల మధ్య గాఢమైన అనురాగం ఉన్నది. సీత పాత్ర గొప్పతనం తిక్కన,
వాల్మీకులు సీత పాత్రను మలచిన తీరు చూస్తే అర్థమవుతుంది.
వాల్మీకి రామాయణాన్ని “సీతాయాశ్చరితం మహత్”అన్నాడు.
నిర్వచనోత్తర రామాయణంలో సీతమ్మ విషయంగా తిక్కన చూపిన పక్షపాత, గౌరవాలు గమనిస్తే, ఉత్తర రామాయణంలో సీత ఎంతో బేలగా కనబడుతుంది.
పూర్వ రామాయణం లో రావణుని జయించిన రాముడు సీతను తిరిగి కలుసుకునే
ముందు ఆమెతో అగ్ని ప్రవేశం చేయిస్తాడు. తర్వాత సీతారాముల పట్టాభిషేకం
జరిగింది. కొంత కాలానికి సీత గర్భవతి అయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత,
అయోధ్య ప్రజలు సీతపై అపవాదు వేస్తారు. రసానుభవదృష్టికీ, ధర్మదృష్టికి ప్రధానమైనది
సీతాపరిత్యాగ ఘట్టము.
రామాయణంలో హృదయద్రావకము, ఉద్వేగ భరితమైన సన్నివేశం ఇంకొకటి లేదు.
లోకాపవాదానికి భయపడి నిర్దోషియైన ప్రియపత్నిని త్యాగం చేయడం ధర్మమా?
అనేది ఆలోచించలేదు రాముడు. సీతను అడవిలో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుని ఆదేశిస్తాడు. ఈ విషయం తెలియని సీత అడవికి వెళ్తూ మార్గమధ్యంలో దుశ్శకునాలు ఎదురవడంతో భయపడి లక్ష్మణునితో –
“ధవునెడబాసి వచ్చు తెగుదారికి నాకిక వంత యేల? ని
య్యపశకునంబులన్ బొడము నాపద లన్నియు మాన్చి, రామభూ
ధవునకు నీవు నత్తలకు దక్కిన బాంధవ పౌరకోటికిన్
వివిధ శుభంబు లీవలయు వేల్పు లటంచు నమస్కరించినన్.”
అని తన వాళ్ళందరూ సుఖంగా ఉండాలని, ఎవరికీ ఏ ఆపద రాకూడదని దేవుళ్ళకు
మొక్కుకున్నది కాని, తనకే ఆపద రాబోతున్నదని అనుకోలేదు సీత. తనవాళ్ళందరి
సుఖాన్ని కోరిన సీత తానే కష్టాలు పడవలసి వచ్చింది. తిక్కన సీతను ఒక బేల,
సుకుమారిగానే కాకుండా ధైర్యం గల ఒక పడతిగా చిత్రించాడు.
రాముడు సీతను అడవిలో వదలిరమ్మని చెప్పగా, లక్ష్మణుడు సీతను అడవిలో వదలిన
సమయంలో సీత రాముని గురించి నిష్ఠురంగా మాట్లాడుతుంది.
“ తనమది యొక్క యుమ్మలిక దక్కిన మంచిది, దాని బాపగా
నని తలపోసి చేయుపని కక్కట! యేనును లోనుగానె? నా
కు నెఱుగ జెప్పి పొమ్మనుటకుం దగనే? మొగమాట లేకమ
న్నన యెడనైన రాజుల మనంబులు ద్రిప్పగ బల్మి గల్గునే?” అంతేకాక
“పతియ చుట్టంబు బక్కంబు, బతియ చెలియు
బతియ తల్లియు దండ్రియు, బతియ గురుడు
పతియ దైవంబు గావున నతని పంపా
నర్చుటయ కాది ధర్మంబు నాతి కరయ?” (9-29)
అని రాముడే నాకు సర్వస్వం. అలాంటిది నాతో ఎందుకు చెప్పలేదు? అని
బాధపడింది సీత. లక్ష్మణుని ముఖం చిన్నబోయి ఉండటం చూసి సీత –
“మీ యన్నకు, దత్సహోదరుల కాప్తులకున్ శుభమే కదన్న? నీ
కన్నుల నేల నశ్రువులు గ్రమ్మెడి? దెల్పగదన్న లక్ష్మణా”
అని అడిగింది. అప్పుడు లక్ష్మణుడు ఏడుపు మొదలు పెట్టాడు. మళ్ళీ సీత –
“మన్నన దొలంగి నిను మీ
యన్న నిరాకరణ చేసి యాడెనొ ? నీ కా
యన్న పయి భక్తి దొలగెనొ ?
కన్నాయము నేమియైన గాఱించితివో?” అని అమాయకంగా అడిగింది.
సీతకు తనకు జరుగుతున్నది ఏమిటో అప్పటికీ అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మణుడు –
“జనపతి లోకనింద బడజాలక నిన్ వని ద్రోయుమన్నచో విని సహియించి…..”
అని చెప్పగా ఆమె పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిన ఆమె పరిస్థితిని
కంకంటి పాపరాజు కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. ఆమె ఇలా ఉన్నదట..
వ|| శోకం బాకారంబు దాల్చిన చందంబున, ఊరక వెక్కి వెక్కి యేడ్చుచు, నేడుపు
విడిచి మౌనంబు పూనుచు, మౌనంబు మాని తనలో దానగుచు, నగవుడిగి తలయూచుచు జాలిగొని హాహాకారంబు సలుపుచు.. దలపని తలపులివిగో సూచితే లక్ష్మణా ! అని అంటూ రాముడు జనాపవాదము విని నన్ను ఇలా అడివికి పంపిస్తాడను
కోలేదు. అంటూ విలపించింది. దానినే తలచుకుంటూ మూర్ఛ పోయింది సీత.
ఆ సందర్భాన్ని తిక్కన ఇలా వర్ణించాడు.
“తొలిమి కొలదుల బోవని
వాలాయపు దిగులు గుండె ప్రయ్య గదిరినం
గీలెడపిన జంత్రము క్రియ
నేలపయిం బడియె మేదినీ తనయ వెసన్”
అని సీత కిందపడి మూర్ఛపోయిందట.
ఈ సందర్భంలో సీత పాత్రను, ఆమె పాత్ర స్వభావాన్ని చక్కగా చిత్రించాడు తిక్కన.
కోరిక తీర్చడానికి పంపిస్తున్నాడనుకున్నది కాని, ఆమెను పూర్తిగా త్యజిస్తారనుకోలేదు.
ఈ సందర్భంలో ఇది ధర్మమా? అధర్మమా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. మానవ
జీవితంలోని ఎన్నో ధర్మ సందేహాలకు ఇది ఒక ఉదాహరణ.
ఇదే సీతను భవభూతి ఒక దేవతామూర్తిగా చిత్రించి, భాగీరథి మొదలైన వారిచేత
సేవలు చేయించాడు. అరుంధతీ, తమసలు ఆమెను కాపాడారు. గంగ ఆమెకు పురుడు
పోసింది. అలాంటి మహాసాధ్వి రాముడు తనను అడవులలో విహరించడానికి, తన
కోరికను తీర్చడానికి పంపిస్తున్నాడు అనుకున్నది కానీ, పూర్తిగా త్యజిస్తాడు అనుకోలేదు.
ఇక రాముడికి ఆమె అంటే గాఢమైన అనురాగం ఆమె సౌందర్యానికి అతడు
ముగ్ధుడౌతాడు. అంతేగాక రాముడు సీత కొరకు విలపిస్తాడు, బాధపడతాడు, మూర్ఛ
పోతాడు. తృతీయాంకంలో సీత తస్కరిణీ విద్య ప్రభావం వలన తమసతో కలిసి
చాటునుండి రాముని అవస్థను చూసి, అతని మాటలను విన్న సీత సుకుమార
హృదయం విలవిల లాడుతుంది. రాముడు మూర్ఛ పోయినపుడు తన స్పర్శతో అతన్ని
మూర్ఛనుండి తేర్పుతుంది. రాముని మాటలు విన్న సీతకు రామునిపై మళ్ళీ మోహం
కలుగుతుంది. అందుకే వారిద్దరినీ కలిపాడు భవభూతి.
తిక్కన కావ్యంలో సీత మాత్రం చివర మళ్ళీ శపథం చేయమనడంతో ఆమె
నిష్కల్మషత్వాన్ని నిరూపించుకోవడానికి ఈ విధంగా చెప్తుంది.
“రామస్వామి పదాంబుజంబు లెదనారాధింతునేనిన్, సదా
రామాజ్ఞన్ జరియింతునేని, దగు జాగ్రత్స్వప్న సుప్త్యాదులన్
రామున్ దప్పనిదాన నౌటయు యథార్థం బేని, నా తల్లి యో
భూమీ! యీ యెడ ద్రోవ జూపి నను గొంపోవమ్మ ! నీలోనికిన్” అని భూదేవి వద్దకు
వెళ్లి పోయింది.
లక్ష్మణుడు :
లక్ష్మణునికి సీతారాములు తల్లిదండ్రులతో సమానము. సీతారాములవద్ద చాలా
చనువు, సీతారాములకు లక్ష్మణునిపై విశ్వాసం కూడా ఉన్నది. అన్నను వదిలి ఎప్పుడూ
ఉండలేదు. అందుకే వనవాసానికి వారితో పాటుగా వెళ్ళి, తాను నిద్ర కూడా పోకుండా
కంటికి రెప్పలా కాపాడాడు. అనుక్షణం రక్షకుడిగా ఉన్నాడు.
అందుకే రాముడు సీతను అడవిలో విడిచిపెట్టి వచ్చుటకు లక్ష్మణుని పంపించాడు..
సీతను రావణుడు అపహరించిన వృత్తాంతం చూసిన లక్ష్మణుడు అన్న అప్పుడు
ఎంతగా విలపించాడో తలచుకుని లక్ష్మణుడు కూడా బాధపడ్డాడు.
లక్ష్మణుడు సీతారాముల దాంపత్యాన్ని వాళ్ళ అనురాగాన్ని వియోగాన్ని చూసినవాడు
కాబట్టి మళ్లీ సీతారాముల మధ్య వియోగం సంభవిస్తుందని తెలిసి చాలా బాధపడ్డాడు.
సీతను అడవిలో వదలుటకు పోయినపుడు సీత లక్ష్మణుని ఎందుకు ఏడుస్తున్నావని,
ఎందుకు బాధపడ్తున్నావని అడిగినపుడు లక్ష్మణుడు –
“జనకజ మోము దీనత యొసంగ గనుంగాని, యీ రెలుంగుతో
జననిరో ! పాయదీ హృదయ శల్యము శోక దవాగ్ని గ్రాగుకం
టెను మరణంబు మేలు జననిందిత కృత్యము బూని వచ్చితిన్
నను శపియించు,” మంచు జరణంబుల చంగట వ్రాలి ఏడ్వగన్”
అలా భోరున విలపించాడు. ఈ సందర్భంలో సీతపై అతనికి గల ప్రేమ వ్యక్తం
అవుతుంది. ఆమెను తల్లి కంటే ఎక్కువ అభిమానించాడు.
ఆమెను వదలి వెళ్ళి పోతున్నప్పుడు –
“చనగాళ్లు రాక చనకిక
జనదని ధేనువును బాయజాలని వత్సం
బును బోలి, జాలిగొని ‘యో
జననీ జననాథు గొలువ జనుదునె ? యనుచున్”
అని వెళ్ళిపోయాడు. ఇక్కడ పాపరాజు సీతను ధేనువుతో పోల్చి, తల్లిని వదలలేక
వెళ్లిపోతున్న లేగ దూడతో లక్ష్మణుని పోల్చాడు.
ముగింపు:
పై మూడు గ్రంథాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినపుడు వస్తు పరంగా మూడు
గ్రంథాలకు మూలం వాల్మీకి రామాయణమే ఐనా, కంకంటి పాపరాజు మాత్రమే వాల్మీకి
రామాయణాన్ని అనుసరించగా, తిక్కన ముగింపు ఒకవిధంగా ఉంటే, భవభూతి ఇచ్చిన
ముగింపు మరొక విధంగా ఉంది. ఈ విషయాలను పైన సోదాహరణంగా చర్చించాను.
పాత్రలపరంగా చూసినట్లయితే వాల్మీకి, సీత పాత్రను ప్రధానంగా అంటే సీత వైపు
మొగ్గు చూపినట్లు అనిపిస్తుంది. రాముడిని ఒక దేవుడి అవతారంలా కాకుండా, ఒక
సామాన్య మానవుడిలా చిత్రించాడు. కానీ ధర్మానికి ప్రతీక ఐన రాముడు, రాజధర్మానికి
ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి, సీతను రాణివాసం నుండి, రాజ్యం నుండి, తన జీవితం
నుండి, దూరం చేయడానికి వెనుకాడలేదు. అని చిత్రించాడు.
భవభూతి ఉత్తర రామ చరితానికి నాటక ప్రక్రియకు అనుగుణమైన మార్పులు చేర్పులు
చేసి, విషాదాంతమైన కథను, సీతారాములను ఏకం చేసి, సుఖాంతం చేసాడు.
తృతీయాంకం లో రాముడు పంచవటీ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ సీతా రాములు
వనవాసం సమయంలో గడిపిన ఆహ్లాదకరమైన జీవితాన్ని స్మరించుకుంటూ, సీత
ఆనవాళ్లను గుర్తుకు తెచ్చుకుంటూ భోరున విలపించాడు. ఇది వాల్మీకి రామాయణం
లో లేని కల్పన. మూర్ఛ పోయిన రాముని, సీత కనబడకుండా, అజ్ఞాతంలో ఉండి, రాముని స్పృశించి ఓదార్చడం, రాముని దుఃఖాన్ని చూసి సీత తట్టుకోలేక పోయింది. నాటకం లోని సీతారాములు విరహంలో, వియోగంలో తపించి, ఏకం కావాలనే ఆకాంక్షను బలంగా చిత్రించాడు భవభూతి. అందుకే చివరకు వారిని కలిపి కథను సుఖాంతం చేయడం వలన నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
తిక్కన కూడా సీత పరంగానే రచించాడు. కథలో కొంత మార్పును చేసి, సుఖాంతం
చేశాడు. అయితే భవభూతి లాగా సీతారాములను కలపలేదు. సీత రసాతలంలోకి
వెళ్ళిపోయింది. రాముడు పుత్రులతో కలిసి సంతోషంగా రాజ్యపాలన చేస్తున్నట్లు
ముగించాడు.
తిక్కన సీత పాత్రను మలచిన విధానం చూస్తే, తిక్కన సీత పాత్రచిత్రణకు కొనసాగింపే
మహాభారతం లోని ద్రౌపది పాత్ర అనిపిస్తుంది.
రాముని పాత్రను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే క్రమంలో కథాగమనాన్ని
మార్చిన తీరు, రాముని పాత్రను మలచిన తీరును గమనిస్తే భవభూతి రాసిన ఉత్తర
రామచరిత నాటకమే ఉత్కృష్టమైనది.